a213

213

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేడు మహిమ దేహ మొనర దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్||

  1. మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు దినోదయమున బ్రియ మగు గురుని దేహమునకు బూయ బరిమళంపు దైలములను సరగ దీసికొని సమాధి కరుగుదెంచి కనులజూడ ||మరణమున్||

  2. నేడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవడు దీయు కరుణను మనకై చేడియ లిట్లనుచు వేగ జేరి యా సమాధి మూత వీడి యుంట జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||

  3. వారు తెల్ల నిలువుటంగితో గూర్చున్న పడుచు వాని జూచి మిగుల భయముతో జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్||

  4. కొరత పైని మరణ మొందిన నజరేయు డేసు కొరకు మిగుల వెదకు చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు రాది శిష్య సమితితోడ జెప్పుడనియె ||మరణమున్||

  5. మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానబడును గలిలైయ మందు గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||

  6. మొదట మగ్దలేనే మరియకు గనబడె నటంచు సుదతి దెల్పె శిష్య వరులకు కొదువలేని సంతసమున గోర్కె దీర బ్రభుని జూడ బదిలమైన యత్నములకు బరగ జేసి చూచి రపుడు ||మరణమున్||

  7. అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్||

Post a Comment

Previous Post Next Post